అమరావతి, 21 జూలై (హి.స.) ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఏ రాష్ట్రాలకు ఎంత భారం అనే అంశంపై చర్చించారు. ఉచిత ప్రయాణంతో లబ్ధి, 100 శాతం రాయితీ వివరాలను మహిళలకు ఇచ్చే జీరో ఫేర్ టికెట్‌లో పొందుపర్చాలన్నారు.
‘‘ఈ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలి. నిర్వహణ వ్యయం తగ్గింపుతో సంస్థను లాభాల బాట పట్టించాలి. లాభాల ఆర్జన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలి. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులే కొనుగోలు చేయాలి. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్‌గా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఇందుకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి. అన్ని ఆర్టీసీ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలి’’అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ