తెలంగాణ, ఆసిఫాబాద్. 22 జూలై (హి.స.)
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి
పొందడానికి 49 జీవో పై కాంగ్రెస్ సర్కారు డ్రామాలు చేస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 49 జీవో రద్దు కాలేదని.. ఎన్నికల కోసం తాత్కాలికంగా నిలిపివేశారని, ఇది కంటితుడుపు చర్యగా ఆమె అభివర్ణించారు. తాము గిరిజన బిడ్డలు అనే చెప్పుకొనే.. పాలకులు ఆదివాసీ గిరిజనులను మోసం చేస్తారని అని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు, మంత్రి సీతక్కలను ప్రశ్నించారు. అప్పుడు కాగజ్ నగర్ ను కవ్వాల్ టైగర్ జోన్ గా ప్రకటించింది. ఇప్పుడు టైగర్ కన్జర్వేషన్ రిజర్వు కోసం 49 జీవోను అమలు చేసింది కాంగ్రెస్సే అని చెప్పారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లక్షలకు పైగా పోడు పట్టాలు ఇచ్చామని..కానీ వారిని ఎప్పుడూ ఇలా వేధింపులకు గురి చేయలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు మోసపూరిత మాటలు నమ్మొద్దని.. ఐక్యంగా ఉండి 49 జీవో రద్దు కోసం ఉద్యమిద్దాం అని చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు