హైదరాబాద్, 22 జూలై (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి
భయపడే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఏ చిన్న సందు దొరికిన దూరిపోయే కేసీఆర్ తనకు చెప్పుకోవడానికి ఏమి లేకనే అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన అద్దంకి.. దొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాని వాళ్లు ఇవాళ తెలంగాణ పేరుతో బయటకు వస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులు అంటే కేవలం నలుగురేనని ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారన్నారు. నిజంగా బీఆర్ఎస్ ప్రజల పక్షమే అయితే వారికి ఈ దుర్గతి పట్టేదే కాదన్నారు. ప్రతి సందర్భంలో ప్రజలను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ దన్నారు. కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొంటున్నదని విమర్శించారు. మొదట మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేని మీరు రాష్ట్ర సమస్యలను ఏం పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి, కోదండరెడ్డి, మందకృష్ణమాదిగ వంటి వారిని అరెస్టు చేసిన మీకు ఇవాళ కేసులు, అరెస్టులు అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్