సిద్దిపేట, 22 జూలై (హి.స.)
సిద్దిపేట, గజ్వేల్ నియోజక
వర్గాలకు సంబంధించి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సిద్దిపేట కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీలో లేక పోవడం పై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పందించిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.
వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ హైమావతి సిద్దిపేట, గజ్వేల్ నియోజక వర్గాలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి దుబ్బాక ఎమ్మెల్యే ఫోటో ఫ్లెక్సీలో ఏర్పాటు చేయలేదని చెప్పారు. అయితే కార్యక్రమానికి ఎందుకు పిలిచారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫోటో ఫ్లెక్సీలో ఏర్పాటు చేయకపోవడం పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు సమావేశ మందిరం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ మేరకు కలెక్టర్ హైమావతి బదులిస్తూ ఇలాంటి పొరపాటులు జరగకుండా చర్యలు తీసుకుంటానని బదులిచ్చారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు శాంతించడంతో రివ్యూ మీటింగ్ కొనసాగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్