మంగళగిరి, 22 జూలై (హి.స.)మంగళగిరికి ఐటీ, ఇతర కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో 50 వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని మంత్రి లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పై అధికారులు దృష్టి సారించాలన్నారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి రెండో విడతలో 2 వేల ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి