తిరుమల, 22 జూలై (హి.స.)
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) అధ్యక్షతన తిరుమల(Tirumala)లో నిర్వహించిన టీటీడీ (TTD) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఈవో శ్యామల రావు, అదనపు ఈవోతో పాటు, బోర్డు సభ్యలంతా హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 58కి పైగా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. వైకుంఠం-3 కాంప్లెక్స్ నిర్మాణంపై సుధార్ఘంగా చర్చించామని తెలిపారు. చక్ర తీర్థంతో పాటు శిలాతోరణం అభివృద్ధి చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్మాణంపై సబ్ కమిటీ వేయనున్నట్లుగా ప్రకటించారు.
తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోటికి తీసుకొచ్చేలా త్వరలోనే తిరుమలలో కొత్త పరిపాలనా భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. మరో 600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. ఆగస్టు నెల నుంచి మూడు పూటలు ఒంటిమిట్టలోని కోదాండరామాలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. ఆలయ భద్రత విషయంలో ఏఐ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని వెల్లడించారు. అందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. భక్తులే టార్గెట్‌గా పెరిగిపోతున్న మోసాలను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీవారి సేవలో ప్రొఫెషనల్స్‌ని కూడా తీసుకుంటామని, కొత్త విశ్రాంతి భవనాలను నిర్మించాలని నిర్ణయించామని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి