హైదరాబాద్, 25 జూలై (హి.స.)
ఈ గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ‘ఎస్తోనియా’ సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ఆయన ప్రశంసించారు. శుక్రవారం ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో సచివాలయంలో తనను కలిసిన వాణిజ్య ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వీరిలో ఇన్ఫర్మేషన్ , కమ్యూనికేషన్ టెక్నాలజి, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆరోగ్యరంగాల ప్రతినిధులున్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా తమకు సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్ బాబు కోరారు.వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ-గవర్నెన్స్ కీలకమని ఆయన తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్