న్యూఢిల్లీ, 25 జూలై (హి.స.) పార్లమెంటు ఉభయ సభల్లో ఐదో రోజైన శుక్రవారం కూడా గందరగోళ వాతావరణం కొనసాగింది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ విపక్షాలు నినాదాలు చేయడంతో రభస ఏర్పడి సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. విపక్ష సభ్యుల నిరసనలతో ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
ఉభయ సభలు శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్సభ లో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానాలపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టాయి. ముఖ్యంగా బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్ చేశాయి. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన నిమిషాల్లో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఎలాంటి చర్చా లేకుండానే మధ్యహ్నం 2 గంటల వరకూ దిగువ సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆతర్వాత సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. సభప్రారంభంకాగానే సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఎంపీగా రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత విపక్ష ఎంపీల నిరసనలతో సభ వాయిదా పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్