యాదాద్రి భువనగిరి., 26 జూలై (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లా
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో మోత్కూరు - రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై అసంపూర్తిగా వదిలేసిన రోడ్డును పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు శనివారం ఆందోళన నిర్వహించారు. రహదారిపై వరి నాట్లు వేసి, రాస్తారోకో చేసి వారు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5.80 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అదే రోడ్డును స్థానిక ఎమ్మెల్యే మరలా శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. శంకుస్థాపన చేసి 18 నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం అతి,గతి లేకుండా పోయిందన్నారు. నిత్యం వందలాది వాహనాలు అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై ప్రయాంచాల్సి వస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రోడ్డును తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రం చేయనున్నట్లు హెచ్చరించారు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్