తిరుపతి, 26 జూలై (హి.స.)
తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి రోడ్డులో వెళుతున్న ఓ ద్విచక్ర వాహనంపై చిరుత దాడికి ప్రయత్నించింది. బైక్ వెనక వస్తున్న కారు డ్యాష్ కెమెరాలో ఈ ఘటన రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలిపిరి చుట్టుపక్కల చిరుతపులుల సంచారం పెరిగిపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులు, ప్రయాణికుల రక్షణకు చర్యలు చేపట్టారు. గతంలో చిరుత సంచరించిన ప్రాంతాల్లో సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నారు.
అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డు సమీపంలో ఇటీవల చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ మార్గంలో అధికారులు గస్తీ పెంచారు. తాజాగా అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డు వద్ద ఓ చిరుత రోడ్డు పక్కనే నక్కి.. బైక్ పై వెళుతున్న వారిపై దాడికి యత్నించింది. బైక్ వేగంగా వెళుతుండడంతో వారు చిరుతకు చిక్కలేదు. చిరుత పట్టు తప్పి రోడ్డుపై పడిపోయింది. బైక్ వెనకాలే ప్రయాణిస్తున్న కారు డ్యాష్ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డైంది. ఈ సంఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు రాత్రిపూట ఘాట్ రోడ్డుపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి