హైదరాబాద్, 26 జూలై (హి.స.)
బీసీలకు 42 శాతం కల్పించే
రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలని ఢిల్లీలో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేసిన విషయం తెలిసిందే. నిజంగా బీసీలపై రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ముఖ్యమంత్రిగా బీసీని చేయాలంటూ కిషన్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర కేబినెట్లో బీసీ నేతలు ఎంతమందికి చోటు కల్పించారో చెప్పాలని ఎద్దేవా చేశారు.
అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీ అని అన్నారు. కావాలనే బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డుతున్నారని, ఆ పార్టీ అధ్యక్షుడు బలహీన వర్గాలకు బద్ద వ్యతిరేకి అని కామెంట్ చేశారు. ముందు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డితో రాజీనామా చేయించి.. ఆ స్థానంలో ఓ బీసీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఆర్డినెన్స్ అంశం ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ పరిధిలో ఉందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్