తెలంగాణ, నిర్మల్. 26 జూలై (హి.స.) నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో తాగునీటి కోసం కాలనీవాసులు ఖాళీ బిందెలతో వర్షంలో శనివారం జాతీయ రహదారి పై రాస్తారోకో చేశారు. తమకు గత పది రోజులుగా తాగు నీరు రావడం లేదని, పలుమార్లు పంచాయతీ సిబ్బందికి దృష్టికి తీసుకవచ్చినా పట్టించుకోకపోవడంతో స్థానిక భైంసా, బాసర జాతీయ రహదారి పై రాస్తారోకో చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
తమ కాలనీలోని బోరు బావి చెడిపోయి రోజులు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవటం లేదని ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆరోపించారు. తక్షణమే బోరు బావికి మరమ్మతులు చేయించి, తాగు నీటిని అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ పోలీస్లు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. త్రాగు నీటి సమస్య పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు తెలియజేస్తామని వారు తెలిపారు. దీనితో కాలనీవాసులు రాస్తారోకోను విరమించారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయిన రాకపోకలను పోలీసులు క్లియర్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు