షాద్నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్.!
హైదరాబాద్, 26 జూలై (హి.స.) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ లారీ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. షాద్‌నగర్‌కు చెందిన మచ్చేందర్‌(55).. శంషాబాద్‌ వ
రోడ్డు ప్రమాదం


హైదరాబాద్, 26 జూలై (హి.స.)

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ లారీ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు.

షాద్‌నగర్‌కు చెందిన మచ్చేందర్‌(55).. శంషాబాద్‌ వర్ధమాన్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న తన కుమార్తె మైత్రి(19)ని కాలేజీకి పంపించేందుకు బైక్‌పై బయలుదేరారు. షాద్‌నగర్‌ చౌరస్తా వద్దకు రాగానే వీరి ద్విచక్రవాహనాన్ని ట్యాంకర్‌ లారీ ఢీకొట్టింది. మచ్చేందర్‌ ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మైత్రికి తీవ్రగాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కు పోయింది. కాపాడండి అంటూ మైత్రి చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

ప్రమాదం జరిగిన వెంటనే అతి కష్టం మీద తన మొబైల్‌ను సమీపంలో ఉన్న ఓ వ్యక్తికి ఇచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయాలని ప్రాధేయపడటం అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. అదే సమయంలో స్నేహితురాలి నుంచి మైత్రికి ఫోన్లు రావడంతో.. స్థానికులు ప్రమాదం విషయం చెప్పి ఆమె బంధువులకు సమాచారం అందేలా చేశారు. కాసేపటికి మైత్రి కూడా కన్నుమూసింది. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande