అమరావతి, 26 జూలై (హి.స.)
వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు గుంతలుపడి బాటసారులు, వాహనదారులకు అసౌకర్యంగా మారడంతో స్పందించిన మంత్రి నారా లోకేశ్ వాటి మరమ్మతులకు ఆదేశించారు. దీంతో తాడేపల్లి పరిధిలోని నులకపేట చైతన్య తపోవన్ వెనక ప్రాంతంలోని 13వ వార్డుకు చెందిన రోడ్డు మార్గం వర్షాలకు గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో దానికి మరమ్మతులు చేపట్టారు. మంత్రి లోకేశ్ తన సొంత నిధులతో యుద్ధప్రాతిపదికన మట్టిరోడ్లపై ఏర్పడిన గుంతలు తొలగించే పనులు శరవేగంగా చేయిస్తున్నారు. మంగళగిరి మండలం చినకాకాని ఎన్నారై జనరల్ వైద్యశాల వెనక ప్రాంతంలో రోడ్డు మార్గం, శ్రీనగర్ కాలనీలో గుంతలు పూడ్చే పనులు సాగుతున్నాయి. తన సొంత నిధులతో పనులు చేయించడంపై స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ