మహబూబ్నగర్., 26 జూలై (హి.స.)
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోకుండా అవార్డుల కోసం ఢిల్లీ టూర్ కొడుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక మొదటి సారిగా పాలమూరు పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు జిల్లా అని, తన ఆత్మ పాలమూరు అని, ఇక్కడి నుండే తాను రాజకీయంగా ఎదిగానని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చి19 నెలలు గడిచిపోయినా జిల్లాలోని నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
కుల గణన చేపట్టి 46 శాతం బీసీ లు ఉన్నారని తేల్చారని, 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించి, అందులో 10 శాతం ముస్లీం లకు ఇస్తే బీసీలకు మిగిలింది 32 శాతం మాత్రమే అని, ఇది బీసీలను మోసం చేయడమేనని, మీరు చేపట్టిన కుల గణన బూటకం అని ఆయన ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో ఎంత మంది బీసీలను ముఖ్యమంత్రులుగా చేశారని, మా కేంద్ర క్యాబినెట్ లో 27 మంది బీసీ మంత్రులున్నారని, బీసీల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ లో ఇద్దరు బీసీ మంత్రులే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. గురు కులాలు, బీసీ హాస్టల్ లో పిల్లలు చనిపోతున్నా పట్టించుకోవడంలేదని, అక్కడ పురుగుల అన్నం పెడుతున్నారని, అది తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నా అడిగే నాథుడే లేడని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్