హైదరాబాద్, 27 జూలై (హి.స.) బీజేపీలో బీఆర్ఎస్ విలీనం
అవుతుందని సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తు అని వార్తలు వచ్చాయని.. అప్పుడే ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఈరోజుకు కూడా అదే మాట మీద ఉన్నామని పేర్కొన్నారు. సీఎం రమేశ్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించుకోవద్దని సూచించారు.
బీజేపీ తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదని.. బీఆర్ఎస్ భావజాలం వేరు.. బీజేపీ భావజాలం వేరు అని కేసీఆర్ చెప్పారని జగదీశ్ రెడ్డి తెలిపారు. చిన్న, పెద్ద బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దని.. చంద్రబాబు నాయుడు అలాంటి వారికే పదవులు ఇచ్చారని అన్నారు. సీఎం రమేశ్ ఇంటికి నేను కూడా మిత్రునిగా వెళ్ళాను. ఆయన ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళ్తే తప్పు ఏంటి అని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..