తెలంగాణ, మహబూబ్నగర్. 27 జూలై (హి.స.)
శాంతి భద్రతల పరిరక్షణలో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి దూకుడు పెంచారు. సైబర్ నేరాలను అరికట్టడాన్ని సీరియస్ గా తీసుకుంటున్న ఆమె మరో ముందడుగు వేసి శనివారం అర్థరాత్రి 12 గంటలకు పట్టణంలోని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లలో అనుమానితులను ప్రశ్నించి, ఫింగర్ ప్రింట్ డివైస్ సాయంతో తనిఖీలు చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ప్రజల భద్రతే మా ప్రధాన కర్తవ్యం అని అన్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిఘా ఉంచడం ద్వారా నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.
ఫింగర్ ప్రింట్ డివైస్ ల సహాయంతో వ్యక్తుల వేలి ముద్రలు క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించగలుగుతామని, వారు తమ నుండి తప్పించుకోలేరని ಆಮ హెచ్చరించారు. ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులో మరింత పటిష్టంగా కొనసాగుతాయని, జిల్లా పోలీస్ శాఖ పై ప్రజలు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచాలని ఎస్పీ జానకి భరోసా కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు