హైదరాబాద్, 3 జూలై (హి.స.)
ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ ను వేగవంతం చేసింది. ఈ కేసులో 2ఏ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి అర్వింద్ కుమార్ వచ్చారు. ఈ కేసులో అర్వింద్ ను ఈ ఏడాది జనవరిలోనే ఏసీబీ ప్రశ్నించి స్టేట్ మెంట్ నమోదు చేసింది. అయితే గత నెల 16న ఇదే కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్, ఏ3 గా ఉన్న హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఇవాళ అర్వింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే గత విచారణ సందర్భంగా అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అర్వింద్ కుమార్ ఇవ్వబోయే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్