హైదరాబాద్, 3 జూలై (హి.స.)
క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా తనను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. పనిచేసే వారిపైనే రాళ్లు విసురాతరని చెప్పారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని, బీసీ కార్డును పట్టుకునే బతుకుతున్నానని వెల్లడించారు. తన సతీమణి, మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ రాజకీయ పరిణామాలపై వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. చాలా కేసులకే నేను భయపడలేదు. నాకు భయం లేదని ముందు నుంచీ చెబుతూనే ఉన్నా అన్నారు.
నేను పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టే జనం నా దగ్గరికి వస్తారు. పనిచేసే వారిపైనే కొందరు రాళ్లు వేస్తారు. నడిచే ఎద్దునే పొడుస్తారు. నేను ఎవరికీ భయపడేది లేదు. నాకు ఎలాంటి గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదు. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ వచ్చేలా చూస్తాం. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని మీనాక్షి నటరాజన్తో చెప్పా. మా సేవల్ని పార్టీ ఉపయోగించుకోవాలని కోరాం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్