తెలంగాణ, వనపర్తి. 3 జూలై (హి.స.)
వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.234 కోట్లతో ప్రణాళికలను రూపొందించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి తెలిపారు. గురువారం తెల్లవారుజామున పట్టణంలో ఆయన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిశీలించడం తో పాటు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు నెలల కాలంలో రూ.50 కోట్లలతో 20 సీసీ రోడ్డు పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించాము అని తెలిపారు.
హిందూ శ్మశాన వాటిక, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను ఆదేశించారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఆటంకాలు కల్పించకుండా ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు