అమరావతి, 5 జూలై (హి.స.): రాజధాని అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే 10వేల ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ అన్నారు. భూ సేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే భూ సమీకరణకు వెళ్తున్నట్లు తెలిపారు. అమరావతి రెండో దశ భూ సమీకరణకు ఇప్పటికే 7 గ్రామాల పరిధిలో 20 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సమ్మతించినట్లు తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సీఆర్‌డీఏ 50వ అథారిటీ సమావేశంలో 7 అంశాలకు ఆమోదం తెలిపినట్లు నారాయణ వెల్లడించారు.
స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు మరో 2,500 ఎకరాల చొప్పున కేటాయించేందుకు సీఎం అంగీకరించారని వివరించారు. అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు అనుబంధంగా 10వేల మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు అదనంగా 2.5 ఎకరాలు, 7,500 మంది సామర్థ్యంలో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు మరో 2 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుకను కృష్ణా నదిలో తవ్వుకునేలా సీఆర్‌డీఏకు అనుమతులు మంజూరు చేశారు. ప్రణాళిక ప్రకారం వచ్చే మూడేళ్లలో రాజధాని అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని నారాయణ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ