విజయవాడ, 5 జూలై (హి.స.)విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు (Aditya Pharmacy MD Narasimha Murthy Raju) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి అయోధ్యనగర్‌లో ఉన్న క్షత్రియభవన్‌లో బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆయన వద్ద సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లుగా పేర్కొన్నట్లు సమాచారం.
కాగా, నరసింహమూర్తిరాజు గతేడాది అక్టోబరులో తన స్నేహితుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. ఇటీవలే ఆ కేసులో బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చి కొద్ది రోజులకే ఆయన ఈ దారుణ నిర్ణయం తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న నరసింహమూర్తి భార్య వెంటనే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఆయన ఆదిత్య ఫార్మసీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి