పాట్నా, 8 జూలై (హి.స.) పాట్నాలో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మంగళవారం ఉదయం పాట్నా సిటీలోని మాల్ సలామీ ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఖేమ్కా హత్య కేసులో కీలక నిందితుడైన రాజాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మాల్ సలామీ ప్రాంతానికి వెళ్లాయి. పోలీసులను గమనించిన రాజా వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపగా రాజా అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఒక పిస్టల్, బుల్లెట్లు, వాడిన తూటాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. రాజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఖేమ్కా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ప్రధాన షూటర్ ఉమేశ్‌కు రాజానే సరఫరా చేసినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో డజనుకు పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 6న జరిగిన ఖేమ్కా అంత్యక్రియలకు హాజరైన రోషన్ కుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని బీహార్ బీజేపీ నేత నీరజ్ కుమార్ ఆరోపించారు. ఒక రాజకీయ నాయకుడే షూటర్‌ను నియమించి ఖేమ్కాను హత్య చేయించారు. ప్రధాన షూటర్ ఉమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ప్రధాన షూటర్ ఉమేశ్ సోమవారమే పట్టుబడినట్టు వార్తలు వస్తున్నా, పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఈ నెల 4వ తేదీ రాత్రి 11:40 గంటల సమయంలో గాంధీ మైదాన్ ప్రాంతంలోని తన నివాసం వద్ద కారు దిగుతున్న గోపాల్ ఖేమ్కాను దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యను నిందితులు పక్కా ప్రణాళికతో అమలు చేశారని పోలీసులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి