దిల్లీ 8 జూలై (హి.స.)భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ మన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐఎస్‌ఎస్ పరిశోధనల్లో నిమగ్నమై ఉన్న ఆయనకు దిల్లీ ప్రజలు హాయ్ చెప్పారు. అదెలా అనుకుంటున్నారా..? కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే ఈ ఐఎస్‌ఎస్ (ISS).. తాజాగా దేశ రాజధాని వాసులను కనువిందు చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నిశీధిలో మిలమిలా మెరుస్తూ దిల్లీ గగనతలంపై కన్పించింది.
ఈ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించిన కొందరు.. మన వ్యోమగామి శుభాంశుకు ‘హాయ్’ అంటూ వాటిని నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రానున్న రోజుల్లోనూ పలుమార్లు ఇది భారత గగనతలం మీదుగా ప్రయాణిస్తుందని, అప్పుడు సాధారణ పౌరులకు కూడా కన్పించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ