హైదరాబాద్, 9 జూలై (హి.స.)జీడిమెట్లలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గాజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలోని HDFC ATM సెంటర్ లో దుండగులు మూడు ఏటీఎం యంత్రాలను కట్ చేసి, భారీగా నగదును అపహరించి పరారయ్యారు. గత రాత్రి ముగ్గురు దుండగులు ATM సెంటర్ లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో మూడు ATMలను కొల్లగొట్టారు. ముఖానికి మాస్క్, తలపై క్యాప్ ధరించి కనిపించిన దొంగలు పూర్తి ప్రణాళికతో చోరీకి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ATM సెంటర్ లోని అలారం దొంగలు ప్రవేశించిన ఒక గంట తరువాత మోగింది. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో క్లూస్ టీమ్ లను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్