జోగులాంబ గద్వాల, 1 ఆగస్టు (హి.స.)
జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ శాఖల వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశం హాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్ నిర్వహణపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉండవల్లి జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ ఘటనలో డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్లను సస్పెండ్ మరో ఇద్దరికి మెమో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం మండల స్థాయి అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అన్ని మండలాలకు జిల్లా స్థాయి స్పెషల్ అధికారులను నియమించామని, ప్రతి నెలా కనీసం రెండు సార్లు పాఠశాలలు సందర్శించి అక్కడి విద్యా, భద్రతా, మౌలిక వసతులైన త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇతర అవసరాలను సమీక్షించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్