అమరావతి, 13 ఆగస్టు (హి.స.)
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ లేదా సొంత వాహనాలతో తిరుమలకు వస్తుంటారు. అయితే సొంత వాహనాలలో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక జారీ చేసింది. తిరుమల వసతి గదులు(రూంలు) కేటాయింపులో టీటీడీ నూతన విధానం అమలు చేస్తోంది. సిఫార్సు లేఖలపై వసతి గదులు పోందాలంటే దర్శనం టిక్కెట్టు తప్పనిసరి చేసింది. టీబీసీ, ఏఆర్‌పీ, యంబీసీ, పద్మావతి కౌంటర్లు వద్ద నూతన నిబంధనలను అమలు చేయనుంది. సీఆర్‌ఓ జనరల్‌లో మాత్రం సామాన్య భక్తులకు రిజిష్ట్రేషన్ విధానంలో గదులు కేటాయించనున్నారు.
మరోవైపు.. తిరుమలకు వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్ జారీ అయ్యింది. అన్ని రకాల వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుంది. అలిపిరి వద్ద ప్రత్యేకంగా ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేసింది. సొంత వాహనాలలో తిరుమలకు వెళ్లే భక్తులు అలిపిరి చెక్ పోస్టు వద్ద చెకింగ్ అనంతరం కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక పర్వదినాలు, విశేష ఉత్సవాల సమయంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. దీంతో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద వాహనాల బారులు తీరుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వివిధ వాహనాలలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు కల్పించడంతో పాటుగా అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవల కోసం 15 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసినట్లు టీటీడీ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ