విశాఖపట్నం, 14 ఆగస్టు (హి.స.)
, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఇది మరింత బలపడి సుస్పష్ట అల్ప పీడనంగా మారే అవకాశముందన్నారు. గురువారం విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కొనసాగుతోందన్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర - ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని తెలిపారు. రాగల వారం రోజుల పాటు రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో సముద్ర తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో సముద్రంలో వేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు ఆయన సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ