హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో 'హైడ్రా' అప్రమత్తమైంది. 24/7 సేవలందించే పనిలో నిమగ్నమైంది. రహదారులపై నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు క్యాచ్పిట్లలో, కల్వర్టుల్లో చెత్తను తొలగిస్తూ వరద సాఫీగా సాగేలా హైడ్రా బృందాలు పని చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని హైడ్రా గుర్తించింది. ఇందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఆ ప్రాంతాల్లో హెవీ మోటార్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. వరద సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లను చేసింది. కొద్దిపాటి సమస్య ఉండే ప్రాంతాలను 144గా గుర్తించి.. అక్కడ వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.
హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు 51 రంగంలో ఉండగా.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్ 150 పని చేస్తున్నాయి. మొత్తంగా 3565 మంది విధుల్లో నిమగ్నమై ఉన్నారు. 9 బోట్లను సిద్ధం చేసుకుని సమస్యాత్మక ప్రాంతాలకు వాటిని చేరవేసింది. నగరంలో 309 ప్రాంతాల్లో హైడ్రా నిత్యం నిఘా పెట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..