హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) - , శేరిలింగంపల్లి, : సంచలనం రేపిన చందానగర్ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ పక్కా పథకంతోనే చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తేలిగ్గా తప్పించుకునేలా ద్విచక్రవాహనాలు వాడటం, దోపిడీకి ఎంచుకున్న ప్రాంతం, సమయం, దుకాణం, పారిపోయిన మార్గాలే ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులు రెండు ద్విచక్రవాహనాలను ఉపయోగించారు. సీసీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా రిజిస్ట్రేషన్ నంబర్లను గుర్తించిన పోలీసులు.. వారు వినియోగించిన రెండు ద్విచక్ర వాహనాలు సెకండ్ హ్యాండ్‌వని, వాటిని నగరంలోని ఆర్‌సీపురంలో ఇటీవల కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు. వారిని తమిళనాడు లేదా బిహార్‌కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. నిందితులు దేశవాళీ తుపాకులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నిందితులు బీదర్‌లో చిక్కినట్లు తెలుస్తున్నా పోలీసులు మాత్రం ఇంకా నిర్ధారించడం లేదు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు.. దోపిడీ జరిగినప్పుడు దుకాణంలో ఉన్న 34 మంది సిబ్బంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. నిందితులను పట్టుకోవడానికి తొలుత 10 బృందాలను ఏర్పాటు చేశారు. మరిన్ని ఆధారాలు చిక్కడంతో అదనంగా మరో రెండు బృందాలను నియమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ