న్యూఢిల్లీ, 18 ఆగస్టు (హి.స.)
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రికవరీ చేసిన రూ. 5489 కోట్లను బాధితులకు రీఫండ్ చేసేలా నిబంధనలను సులభతరం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయంలో సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (CIS) కార్యకలాపాలను కేంద్ర మంత్రి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ సైబర్(I 4C)క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రాధాన్యతను వివరించారు.
సైబర్ నేరాలపై పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించే ప్రధాన కేంద్రంగా ఐ4సీ పనిచేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు సైబర్ మోసాల నియంత్రణలో భాగంగా తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి సంబంధిత శాఖ అధికారులు వివరించారు. సైబర్ మోసాల బాధితుల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. దీంతోపాటు 12 లక్షలకుపైగా సిమ్లు/మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. అట్లాగే రూ.4631 కోట్లు విలువైన మోసపూరిత లావాదేవీలను అడ్డవడం జరిగిందని, అందులో భాగంగా 13.3 లక్షల మ్యూల్ అకౌంట్లను (సైబర్ మోసాల్లో డబ్బు తరలించడానికి వాడే బ్యాంకు ఖాతాలు) ఫ్రీజ్ చేసినట్లు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..