హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై లైఫ్‌టాక్స్ పెంచింది. ఆగస్టు 14 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రవాణా, రోడ్లు-భవనాల శాఖ జారీ చేసిన జీఓ నెం.53 ద్వారా మోటార్ వాహనాల పన్ను చట్టం, 1963లోని షెడ్యూల్స్‌లో మార్పులు చేసింది. ఈ మేరకు రెండు, మూడు, నాలుగు చక్రాల నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు పెరిగిన లైఫ్‌టాక్స్ వసూలు చేయనుంది. తాజా నిర్ణయం ప్రకారం, రూ.50 వేలు లోపు ధర కలిగిన రెండు చక్రాల వాహనాలపై ఇప్పుడు 9 శాతం పన్ను విధించనున్నారు. రూ.50 వేలు నుంచి ఒక లక్ష వరకు ఉన్న బైకులపై 12 శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది. ఒక లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఉన్న వాహనాలపై 15 శాతం, రెండు లక్షలకు పైబడిన వాటిపై 18 శాతం లైఫ్‌టాక్స్ వసూలు చేస్తారు. ఉదాహరణకు రూ.1.10 లక్షల బైక్ కొంటే ఇంతకుముందు రూ.13,200 పన్ను ఉండగా, ఇప్పుడు అది రూ.16,500కి పెరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు