తెలంగాణ, మెదక్. 14 ఆగస్టు (హి.స.)
ఏడుపాయల సమీపంలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లడంతో వన దుర్గ మాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వనదుర్గా ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ఆలయ సమీపంలో ఉన్న వంతెనల వద్ద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తూ నిజాంసాగర్ వైపు పరుగులు పెడుతుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అమ్మవారి ఆలయాన్ని గురువారం మూసివేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు.
సింగూరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేయడంతో నీరు మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో భక్తులు ఎవరు ఆలయం వైపు వెళ్లొద్దని పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. వరద ఉధృతి తగ్గగానే ఆలయాన్ని సంప్రోక్షణ చేసి పునఃప్రారంభిస్తామని ఆలయ సిబ్బంది వెల్లడించారు. ఆలయం మూసివేసినందున పూజలు రాజగోపురంలో నిర్వహిస్తున్న విషయం భక్తులు గమనించాలని ఆలయ సిబ్బంది సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు