ఆ ధైర్యం రాహుల్ గాంధీకి ఉందా? సుప్రీం తీర్పుపై కేటీఆర్
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) సుప్రీం కోర్టు తీర్పును తన విజయంగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి సుప్రీం కోర్టు మరొక బలమైన ఆదేశం ఇచ్చిందనే విషయం గుర్తుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వి
కేటీఆర్


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)

సుప్రీం కోర్టు తీర్పును తన విజయంగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి సుప్రీం కోర్టు మరొక బలమైన ఆదేశం ఇచ్చిందనే విషయం గుర్తుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రతి ఒక్కరి ఓటుకి విలువ ఉండేలా చూసుకోవడం ఎంత ముఖ్యమో అదే ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం అని రాహుల్ గాంధీకి గుర్తు చేస్తున్నానన్నారు. ఇవాళ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన కేటీఆర్.. తెలంగాణలో కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును తన కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని, దానిని అమలు చేస్తుందని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ఐఆర్), ఓటర్ల తొలగింపు అంశంలో సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం దేశంలో ప్రజాస్వామ్యానికి గొప్ప విజయం అన్నారు. ఇటీవల ఎన్నికల సంఘంతో ఇటీవల జరిగిన సమావేశంలో ఓటర్ల తొలగింపు డేటాను ప్రచురించడంతో పాటు పౌరసత్వానికి రుజువుగా ఆధార్ను అంగీకరించాలని బీఆర్ఎ ఎస్ డిమాండ్ చేసిందన్నారు. ఒక పారదర్శక, బలమైన ప్రజాస్వామ్య ప్రక్రియ భారత రాజకీయాలకు బలమైన వెన్నెముక అవుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande