హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)
ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రూ. 12 ఉన్న దీన్ని రూ.14కి పెంచినట్టు కంపెనీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పండుగ సీజన్ రద్దీ కారణంగా ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయని, డెలివరీ ఏజెంట్లకు ఎక్కువ చెల్లించాల్సి ఉండటమే కాకుండా, నిర్వహణ ఖర్చులు పెరిగాయని కంపెనీ వివరించింది. లక్షలాది మంది కస్టమర్లు పండుగ వేడుకల కోసం ఎక్కువ ఆర్డర్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రోజువారీ ఆర్డర్ వాల్యూమ్ కూడా గణనీయంగా పెరిగాయి. అయితే, ఎక్కువ ఆర్డర్ల డిమాండ్ ఉన్న సమయంలో మాత్రమే ఈ కొత్త ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేస్తాయని, ఆ తర్వాత పాత రేట్లనే కొనసాగించనున్నట్టు స్విగ్గీ వివరణ ఇచ్చింది. పరిశ్రమ అంచనాల ప్రకారం స్విగ్గీ 20 లక్షలకు పైగా రోజువారీ ఆర్డర్లను తీసుకుంటోంది. అంటే రూ.2 పెంపు వల్ల ప్రతిరోజూ దాదాపు రూ.2.8 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది. అయితే, ఈ పెంపు ద్వారా ఒక్కో ఆర్డర్ డెలివరీ చేయడంలో స్విగ్గీ మరింత సౌకర్యవంతమైన సేవలందించేందుకు వీలవుతుందంటున్నారు. ఇదివరకు స్విగ్గీ ఒక్కో ఆర్డర్ డెలివరీ సేవలను మెరుగుపరిచేందుకు 2023, ఏప్రిల్ నుంచి రూ.2తో ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..