జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు మృతి
మహబూబ్నగర్, 15 ఆగస్టు (హి.స.) ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలోని మాచారం బ్రిడ్జిపై శుక్రవారం ఉదయం 5.30 ప్రాంతంలో చోటుచేసుకుంది. కడప నుంచి 35 మంది ప్రయాణికులతో సీజీఆర్ ట్రా
రోడ్డు ప్రమాదం


మహబూబ్నగర్, 15 ఆగస్టు (హి.స.)

ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలోని మాచారం బ్రిడ్జిపై శుక్రవారం ఉదయం 5.30 ప్రాంతంలో చోటుచేసుకుంది. కడప నుంచి 35 మంది ప్రయాణికులతో సీజీఆర్ ట్రావెల్ వోల్వో బస్సు హైదరాబాద్కు బయలుదేరింది. ఈ క్రమంలోనే జడ్చర్ల మండల పరిధిలోని మాచారం బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు వేగంగా ఢీకొనడంతో డ్రైవర్తో పాటు ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.

మృతులు హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవి (65), రాధిక (45)గా గుర్తించారు. మృతి చెందిన ఇద్దరు ప్రయాణికులు అత్తా, కోడళ్లు కాగా... వారితో పాటు మరో కొడుకు కోడలితో కలిసి కడపలో ఓ శుభకార్యానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో సుమారు 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ రత్నం ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. లారీ, బస్సు రోడ్డు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారి 44పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదానికి కారణం వోల్వో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే అయి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande