అమరావతి, 15 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలోని మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం ప్రారంభం కానుంది. ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకం అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో శుక్రవారం సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు రూ.4వేల వరకు ఆదా అవుతుంది.
రాష్ట్రంలోని ఐదు రకాల బస్సుల్లో శుక్రవారం సాయంత్రం నుంచి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. మహిళలకు ఇచ్చే టికెట్లపై స్త్రీ శక్తి పథకం అని ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు. ప్రయాణ ఛార్జీ ఎంతో ఉంటుంది. ఆ సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని.. ప్రయాణికురాలు చెల్లించాల్సింది సున్నా(0) అని ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి