గుంటూరు, 15 ఆగస్టు (హి.స.)
ఈరోజు మహాత్మా గాంధీ చెప్పిన ఒక్క గొప్ప విషయం నాకు గుర్తుకు వస్తోంది. ప్రపంచంలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుండే మొదలవ్వాలని గాంధీజీ చెప్పారు, ఆ మహనీయుని స్పూర్తితో మార్పు మన నుండే మొదలుకావాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమానికి మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ డేస్ గుర్తొస్తాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక హడావిడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ను డెకరేట్ చేసే వాళ్ళం. స్కూల్ లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బమ్స్ వచ్చేవి. ఆ మూమెంట్ ఈ రోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ప్రపంచంలో ఒకే ఒక్క పవర్ ఫుల్ వెపన్ ఉంది. ఇతర ఏ వెపన్స్ చెయ్యలేని పని ఆ వెపన్ చేస్తుంది. ఆ వెపన్ పేరే అహింస. ఆ వెపన్ మనకు ఇచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాత్రంత్య్రం సాధించారు.
తెలుగునేలది ప్రత్యేక చరిత్ర
స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేల కు ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ వాడి తుపాకీకి గుండె చూపిన యోధుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. “మాకొద్దీ తెల్లదొరతనం” అని నినదించారు గరిమెళ్ల సత్యనారాయణ. అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది దేశభక్తులు, స్వాతంత్య్రం సమరయోధులు మన తెలుగు నేలపైనే పుట్టారు. మన సమరయోధుల ఘనకీర్తి దేశానికి తెలిసేలా చేద్దాం. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దాం.
గుంటూరు జిల్లాలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన జిల్లాలోని పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలిలో ఆందోళనలు జరిగాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణ త్యాగం చేశారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు, ఆనాటి ఘట్టాలను గుర్తు చేస్తూ ఒక మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నాం.
స్వాతంత్రోద్యమంలో చెరగని ముద్ర
స్వతంత్ర పోరాటంలో గుంటూరు నేలది చెరగని ముద్ర. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, పర్వతనేని వీరయ్య చౌదరి, తమనంపల్లి అమృతరావు వంటి ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారందరి సేవలను మనం గుర్తు చేసుకోవాలి. కులం, మతం, ప్రాంతం కంటే దేశం గొప్పది. అందరిలోనూ దేశ భక్తి ఉండాలి. దేశం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటి అవ్వాలి. ఈ సందర్భంగా పెహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుకోవాలి. పాకిస్థాన్ ఉగ్రవాదులు పెహల్గామ్ లో దాడులు చేసి 26 మంది అమాయకుల్ని చంపేశారు. గత ప్రభుత్వాల మాదిరి మనం కన్నీరు పెట్టుకొని ఇతర దేశాల సహాయం కోసం వెళ్ళలేదు. మన దేశ పవర్ ఫుల్ మిస్సైల్ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు పాక్‌కి సరైన శిక్ష వేశారు. ఆపరేషన్ సిందూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఆపరేషన్ సిందూర్ జరిగేప్పుడు కొంతమంది సైనికులను కూడా మనం కోల్పోయాం. అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ ను కూడా కోల్పోయాం. మురళీ నాయక్ తల్లితండ్రిని నేను కలిశాను. వారికి ఒక్కడే కొడుకు. మురళి నాయక్ సైన్యం లోకి వెళ్లడం వారికి ఇష్టం లేదు. మురళి నాయక్ ను ఆర్మీ కి వెళ్లొద్దు, నీకు ఏమైనా అయితే మేము తట్టుకోలేం అన్నారు. అప్పుడు మురళి నాయక్ ఒక్కటే చెప్పాడు. నేను యుద్ధంలో చనిపోతే దేశం మొత్తం మీ కోసం నిలబడుతుంది అని. మురళి నాయక్ లాంటి సైనికులు బోర్డర్ లో పోరాడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ స్వేచ్ఛగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి