దిల్లీ:15 ఆగస్టు (హి.స.) జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికల్లో ఓటేసేందుకు జైల్లో నిర్బంధంలో ఉన్న ఎంపీలకు పోస్టల్ బ్యాలట్ పేపర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఉగ్రవాదానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల కేసులో బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉండగా.. జాతీయ భద్రతకు సంబంధించిన కేసులో ఖడూర్ సాహిబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వీరు ఓటు ఉపయోగించుకోవాలనుకుంటే.. వీరికి సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘాని(ఈసీ)కి ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. దాని ప్రకారం వారికి ఈసీ పోస్టల్ బ్యాలట్ పేపర్లను ఇస్తుంది. దాని ద్వారా వారు ఓటేయొచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం.. ముందస్తు నిర్బంధంలో ఉన్న ఓటర్లు మాత్రమే ఇలా పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటేసేందుకు అర్హులు. మిగతా ఓటర్లందరూ పార్లమెంట్‌లో ఏర్పాటు చేసే కేంద్రాల్లోనే ఓటేయాల్సి ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ