అమరావతి, 16 ఆగస్టు (హి.స.)): రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా లెజినోవా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన సతీమణి గుడియా ఠాకూర్ తదితరులు విచ్చేశారు. సాయంత్రం 6.15 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న చంద్రబాబు దంపతులు, పవన్ కల్యాణ్ దంపతులు.. గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందించి ప్రధాన వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం జాతీయ గీతాలాపనతో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది. అతిథుల వద్దకు గవర్నర్ స్వయంగా వెళ్లి పలుకరించారు. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, సీజే.. కుటుంబ సమేతంగా ఆల్పాహారం స్వీకరించారు. అనా లెజినోవా తొలిసారి ఎట్‌హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయంత్రం 6.45గంటలకు ఎట్ హోమ్ ముగిసింది. సీఎం, డిప్యూటీ సీఎం, సీజే మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను రాజ్‌భవన్‌లోకి సాగనంపారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ధరించిన చొక్కా, పై కండువా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీడీపీకి ప్రతీక అయినా పసుపు చొక్కా, జనసేనకు ప్రతీకగా మారిన ఎర్రకండువాను ధరించి ఆయన ఎట్ హోమ్‌కు హాజరయ్యారు. మంత్రి కొల్లు రవీంద్ర, సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హైకోర్టు న్యాయమూర్తులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మండలి మాజీ డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, పద్మ అవార్డు గ్రహీతలు, స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ