హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
తెలంగాణ లో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జగిత్యాల మినహా 15 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయని ఆయన చెప్పారు.ప్రత్యేకంగా నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో శనివారం ఉదయం సీఎం ఉన్నతాధికారుల తో సమీక్ష నిర్వహించారు.వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో SDRF,NDRF బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని సీఎం వెల్లడించారు. వాగులు, వంకలు పొంగిపొర్లే పరిస్థితుల్లో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే రక్షణ శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్