అమరావతి, 16 ఆగస్టు (హి.స.)
విజయవాడ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో నిర్వహించిoన సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవి ఎన్నిక సాంకేతిక కారణాలతో వాయిదా పడగా.. 34 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మూడేళ్ల కాలపరిమితితో ఏపీలో క్రికెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయనుంది. భవిష్యత్తులో చేపట్టే పనులు, స్టేడియాల నిర్మాణం, టోర్నమెంట్ల నిర్వహణపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని మాట్లాడుతూ.. తమపై కార్యవర్గం ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఏసీఏ ద్వారా క్రికెట్ అభివృద్ధికి, స్టేడియాల్లో మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి చెందిన క్రికెట్ క్రీడాకారులు అంతర్జాతీయ మ్యాచుల్లో, ఐపీఎల్‌లో ఆడే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అందుకు కావాల్సిన సపోర్టింగ్ స్టాఫ్, కోచ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నం స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్-4 విజయవంతంగా జరుగుతుందన్నారు. ఏసీఏ ప్రతిష్ఠ మరింతగా పెంచే విధంగా కృషి చేస్తామని కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ