హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)తెలంగాణాలో మళ్లీ వర్షం మొదలైంది. పలు జిల్లాల్లో దంచికొడుతోంది. తాజాగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అల్లకల్లోలం సృష్టించింది వర్షం. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో 14.7 సెం. మీ, మెదక్ జిల్లా శివంపేటలో 12.8 సెం.మీ మేర వర్షపాతం నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా మీన్ పూర్ లో కోమటి కుంటకు గండి పడటంతో పంటపొలాలు నీట మునిగాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట శివారు మోత్కుల కుంటకు గండి పడి నీరు వృథాగా పోతోంది. మెదక్ జిల్లా రెగోడ్‌లో వర్షానికి పెట్రోల్ బంక్ జలమయమయ్యింది. మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండా, సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద లోని మున్యాతండా, గైరాన్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజు మంజీరా నది ఉద్ధృతికి ఏడుపాయల ఆలయం మూతపడింది. అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు