తెలంగాణ, వరంగల్. 16 ఆగస్టు (హి.స.)
మామునూరు విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నది. ప్రభుత్వం చెల్లించే పరిహారం విషయంలో భూమిని కోల్పోతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల భూసేకరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి భూమిని సేకరించాలని ఆదేశించింది.
ఒక ఎకరానికి రూ.1.20 కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్లో సుమారు రూ.5 కోట్ల విలువ చేసే భూమికి రూ.1.20 కోట్లు చెల్లించడం సబబు కాదంటూ రైతులు ఆందోళనకు దిగారు. తమ భూములకు న్యాయమైన ధర అందించాలని నక్కలపల్లి, గుంటూరు పల్లి రహదారి మధ్యలో శనివారం రోడ్డుపై బైఠాయించారు. రహదారి సమీపంలో ఉన్న తమ భూములకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు