అమరావతి, 17 ఆగస్టు (హి.స.): దక్షిణ ఛత్తీస్గఢ్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. నేడు వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. చెట్ల కింద, శిథిలావస్థలోని భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని సూచనలిచ్చింది. లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుం టూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ