తెలంగాణ, నల్గొండ. 17 ఆగస్టు (హి.స.)
నల్లగొండ జిల్లాలో ఎన్నో కేసులకు పురోగతి చూపించిన పింకీ ట్రాకర్ డాగ్ ఆదివారం మృతి చెందింది. ఈ పింకీ 2015 లో ఐఐటీ మొయినాబాద్ లో 9 నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకొని సుమారు 10 సంవత్సరాల కాలం నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక నేర పరిశోధన, చోరీ కేసులలో కీలకంగా పని చేసి నిందితులను గుర్తించింది.
పింకీ క్లూ లో నెంబర్ వన్...
ఐఐటీ మొయినబాద్ లో 9 నెలలు ట్రైనింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జాగిలాలలో ఇది గోల్డ్ మెడల్ సాధించింది. పోలీసులకు కూడా అంతుచిక్కని నల్లగొండలో ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా చేసి పలు చౌరస్తాలలో తల మొండెం వేరు చేసిన సంచలన హత్య కేసులో కీలకమైన పాత్ర పోషించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జూలకంటి ఇంద్రా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితుల జాడలను తెలిపింది. గుండాల మండలంలోని వంగాల గ్రామంలో ఒక వ్యక్తిని చంపి బావిలో పడేసిన వారం రోజుల తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు ఈ డాగ్ తో అన్వేషణ చేస్తే నిందితుల ఇండ్లలోకి వెళ్లి పసిగట్టిన విషయం అందరికి తెలిసిందే. పింకీ మరణం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు