కరీంనగర్, 17 ఆగస్టు (హి.స.)
ఓట్లు, అధికారం కోసం కాంగ్రెస్
పార్టీ దేశభద్రతనే పణంగా పెట్టడం మంచి పద్ధతి కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఇలాంటి చవకబారు ఆరోపణలు సరికాదని విపక్షాలను దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అని సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దాని ప్రకారం నిర్ణయాలు ఉంటాయి తప్ప దానికి పార్టీకి, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది.. ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా? అని నిలదీశారు. ఇవాళ కరీంనగర్ లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓట్ చోరీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు.
తెలంగాణ, కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని, ఇక్కడ కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి కదా అని ఈటల ప్రశ్నించారు. మీరు గెలిస్తే మెషన్లు, ఈసీ మంచిగా పని చేసినట్లు, ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్లు, ఓట్ల చోరీ జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన అని మండిపడ్డారు. హైదరాబాదులో అద్దెకు ఉండేవాళ్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటారని వీరి ఓట్లను సరి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది కదా అని ప్రశ్నించారు. ఓట్ల నమోదు, డబుల్ ఓట్లను తొలగించే విధానం నిరంతర ప్రక్రియ అన్నారు. బీహార్ బార్డర్ ఉన్న ప్రాంతం అని ఇక్కడికి బంగ్లాదేశ్ ఇతర ప్రాంతాల నుండి వచ్చే అవకాశం ఉందన్నారు. అలా వచ్చిన వారికి ఆధార్ కార్డులు సిటిజన్ షిప్ ఇవ్వడం ఎంత మాత్రం దేశానికి క్షేమం కాదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..