హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)
విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని
దానిని సాధించే దిశగా ముందడుగు వేయాలని ఏఐసీసీ రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ అన్నారు. దేశం బాగుండాలంటే నేటీ యువత రాజకీయాల్లోకి రావాలని, నాయకత్వ లక్షణాలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలన్నారు.
జనహిత పాదయాత్రలో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని నెహ్రు మొమెరియల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోని పిచ్చిమొక్కలను, పొదలను తొలగించి శుభ్రం చేశారు. కళాశాల ప్రాంగణంలో నాయకులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు.
అనంతరం విద్యార్థులతో సమావేశమై వారితో మాట్లాడారు. మనం చేసే వృత్తిని నిజాయితీతో, నిబద్ధతతో చేసినప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు. తాము కళాశాలలోనే శ్రమదానం నిర్వహించడం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెరిగి, గ్రామాల్లోని ప్రజలు పరిసరాలను శుభ్రపరిచే విధంగా వారిలో ప్రేరణ కలుగుతుందన్నారు. శ్రమదానం నిర్వహించడం వలన కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు. విద్యార్థులు కష్టపడి చదవి, ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. మాతృబాషతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల పై పట్టు సాధించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..