హైదరాబాద్, 2 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో బీసీల హక్కులను కాంగ్రెస్
ప్రభుత్వం కాలరాసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ ఇందిర పార్క్ వద్ద అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పూర్తిగా వారికే ఇవ్వాలనే డిమాండ్ చూస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ నిలువునా మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పై బీజేపీని ప్రశ్నించే హక్కు హస్తం పార్టీకి లేదన్నారు.
యావత్ తెలంగాణ లోని బీసీలంతా బీజేపీ వెంటే ఉన్నారని కామెంట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల ముసుగులో 42 శాతంతో రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో సందర్భంగా కామారెడ్డి డిక్లరేషనన్ను అనుసరించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకు మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని, ఆ టూర్లతో రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనం శూన్యం అని ధ్వజమెత్తారు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి కి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని.. మళ్లీ నేడు జంతర్ మంతర్ వద్ద డ్రామాలు వేసేందుకు కాంగ్రెస్ ట్రూప్ బయలుదేరిందని రాంచందర్ రావు సెటైర్లు వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..