నాగర్ కర్నూల్, 2 ఆగస్టు (హి.స.)
ఇక్కడ చికెన్... చేపల ఫ్రై తిని వెళ్ళడానికి రాలేదు. అభివృద్ధి అంశాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే మాటల్లో ఒక్కటి కూడా సొల్లు మాటలు లేవు.. నన్నే స్పీచ్ ఆపమంటారా” అంటూ నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఉద్యోగ భరితంగా ప్రసంగించారు. శనివారం కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించేందుకు కొంత ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఈ క్రమంలో స్థానిక నాయకుడు ఒకరు కాగితంపై సమయాభావం వల్ల మీ ఉపన్యాసాన్ని ముగించమని ఇచ్చాడు. దీంతో ఎంపీ మల్లు రవి ఒకింత అసహనానికి గురై.. చీటీ ఇచ్చిన నాయకుని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నేను హాజరు కావలసి ఉంది. కేవలం ఈరోజు ఈ కార్యక్రమాల వల్లే వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చాను. ప్రతిదీ ప్రజల కోసం మాట్లాడుతున్న.. నన్నే ఆపమంటారా “అని ఎంపీ ఉద్విగ్నంగా మాట్లాడారు. మంత్రి జూపల్లి గారు ఇటువంటి వారిని కట్టడి చేయాలి” అంటూ విజ్ఞప్తి చేసి తన ప్రసంగాన్ని ఎంపీ ముగించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్